Telangana: 2013లో ఒక్క నివేదికను సాకుగా చూపుతూ ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ శఠగోపం పెట్టింది!: జీవీఎల్

  • హోదా ఇవ్వడం తప్పని రాజన్ చెప్పారు
  • ఇవ్వాలనుకుంటే చట్టంలోనే పెట్టేవారు కదా!
  • సోనియా, కేసీఆర్ లాలూచీ పడ్డారు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకుండా కాంగ్రెస్ పార్టీనే కుట్ర చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై 2013లో అప్పటి రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇవ్వడం ఆమోదనీయం కాదని రఘురాం రాజన్ సెప్టెంబర్ 23న నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. దీని ఆధారంగానే ప్రత్యేకహోదా డిమాండ్ ను నిర్వీర్యం చేయాలన్న కుట్రకు కాంగ్రెస్ తెరతీసిందన్నారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.

ఇప్పుడు ఆంధ్రులను మోసం చేసేందుకు సీఎం చంద్రబాబు, సోనియా గాంధీ మరోసారి చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. రఘురాం రాజన్ ద్వారా ప్రత్యేక హోదాకు శఠగోపం పెట్టించారనీ, ఆంధ్రులను మోసం చేస్తూ దొంగనాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఏయే ప్రయోజనాలు చేకూరుస్తారు? అనే విషయాలపై రాహుల్ ఈ నెల 28న ఖమ్మం బహిరంగ సభలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాను కర్ణాటక ప్రభుత్వంతో పాటు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత వీరప్ప మొయిలీ వ్యతిరేకిస్తున్నారని జీవీఎల్ గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఏ రకంగా సాధ్యమని ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టంలో లేకపోయినా రాష్ట్రానికి కేంద్రం ఇతోధికంగా ఆర్థిక సాయం చేసిందనీ, అన్నిరకాలుగా ఆదుకుందని జీవీఎల్ తెలిపారు. డిసెంబర్ 11న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 5 గంటల తర్వాత కేసీఆర్, చంద్రబాబు ఒక్కటై పోతారని జోస్యం చెప్పారు. వీరిద్దరూ మోదీకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News