Andhra Pradesh: ప్రపంచమంతా అమరావతివైపు చూస్తోంది.. గుంటూరులో ఈరోజు చరిత్ర సృష్టించబోతున్నాం!: సీఎం చంద్రబాబు

  • టాప్-5 నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం
  • ఏపీని పంచనదుల మహా సంగమం చేస్తాం
  • నీరు-ప్రగతిపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్

బోట్ రేసింగ్, ఎయిర్ షో కార్యక్రమాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి పెంచామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి అమరావతిపైనే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే టాప్-5 సుందరమైన నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం పునరుద్ఘాటించారు. అమరావతిలో ఈ రోజు ‘నీరు-ప్రగతి’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే గోదావరి-కృష్ణా నదులను తమ ప్రభుత్వం అనుసంధానం చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో పంచ నదుల మహాసంగమం ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో సూక్ష్మ సేద్యంతో అద్భుతాలు సాధిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

సూక్ష్మసేద్యం కారణంగా జిల్లాలో పంటల ఉత్పాదకత 29 శాతం పెరిగిందన్నారు. రబీ సీజన్ లో రాయలసీమతో పాటు ప్రకాశంలో పంటల విస్తీర్ణం పెరిగిందని సీఎం అన్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికలను ఉటంకించారు. నాణ్యమైన పైర్లు, ఆరోగ్యకరమైన జీవన అలవాట్లకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ గా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఇందుకోసం గోకులం, మినీగోకులం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీజీ ద్వారా పాలనలో పారదర్శకత తీసుకొచ్చామనీ, త్వరలోనే రాష్ట్రమంతటా ఆర్టీజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, అధికారులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

More Telugu News