sydney: కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. టీమిండియా ఘన విజయం

  • ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇండియా
  • 41 బంతుల్లో 61 పరుగులు సాధించిన కోహ్లీ
  • మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యా
  • ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శిఖర్ ధావన్

సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ విధించిన 165 పరుగుల విజయలక్ష్యాన్ని మరో రెండు బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ కోహ్లీ 41 బంతుల్లో 61 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

టార్గెట్ ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు దూకుడుగా ఆడుతూ తొలి వికెట్ కు 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధావన్ 41 పరుగుల (22 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం రోహిత్ కు కోహ్లీ జతకలిశాడు. అదే స్కోరు వద్ద రోహిత్ శర్మ కూడా జంపా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 16 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 2 సిక్సర్లు, ఒక్క ఫోర్ సాయంతో 23 పరుగులు చేశాడు.

అనంతరం కేఎల్ రాహుల్ 20 బంతుల్లో 14 పరుగులు (1 సిక్స్) చేసి మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో నైల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన రిషభ్ పంత్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే టై బౌలింగ్ లో క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం కోహ్లీతో కలసి దినేష్ కార్తీక్ భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. 18 బంతులను ఎదుర్కొన్న కార్తీక్ ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

చివరి ఓవర్ లో 5 పరుగులు చేయాల్సి ఉండగా... టై వేసిన తొలి రెండు బంతులకు పరుగులు రాలేదు. దీంతో, ప్రేక్షకుల్లో టెన్షన్ మొదలైంది. అనంతరం కోహ్లీ వరుసగా రెండు ఫోర్లను బాది జట్టును గెలిపించాడు. దీంతో, సిరీస్ 1-1తో సమమైంది. ఆసీస్ బౌలర్లలో స్లార్క్, జంపా, మ్యాక్స్ వెల్, టైలు చెరో వికెట్ తీశారు.

36 పరుగులకు 4 వికెట్లు తీసిన కృణాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ మ్యాచ్ తో పాటు తొలి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. టీ20ల్లో విరాట్ కోహ్లీ ఛేజింగుల్లో ఇప్పటివరకు 14 సార్లు నాటౌట్ గా నిలిచాడు. ఈ 14 మ్యాచుల్లోనూ ఇండియా గెలవడం గమనార్హం. 

More Telugu News