Sonakshi Sinha: సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు.. రూ.28 లక్షలు నొక్కేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు!

  • మా కార్యక్రమానికి సోనాక్షి రావాల్సిఉంది
  • పారితోషకంతో పాటు విమానం టికెట్లు ఇచ్చాం
  • రాకుండా మమ్మల్ని మోసం చేశారు

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇబ్బందుల్లో చిక్కుకుంది. సోనాక్షితో పాటు ఆమె మేనేజర్, మరో ఐదుగురు తమను మోసం చేశారని ఇండియన్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్స్ కంపెనీ పోలీసులను ఆశ్రయించింది. ఓ కార్యక్రమం కోసం సోనాక్షికి రూ.28 లక్షలు చెల్లించామని కంపెనీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అయితే చెప్పిన సమయానికి సోనాక్షి రాలేదనీ, తాము పారితోషకంగా ఇచ్చిన రూ.28 లక్షలను తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తోందని తెలిపింది. సోనాక్షి రాకపోకల కోసం విమానం టికెట్ ను రిజర్వ్ చేయించామని సంస్థ చెప్పింది.

అయితే నగదును తిరిగి ఇవ్వాలని గట్టిగా కోరడంతో తమను చంపేస్తామని సోనాక్షి మేనేజర్ బెదిరిస్తున్నారని కంపెనీ యజమాని ప్రమోద్ శర్మ ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని మురాదాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. కాగా, ఈ వ్యవహారంపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా 'లింగా'తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్-1, దబాంగ్-2, అఖిర, రౌడీ రాథోడ్, రాజ్ కుమార్, సన్ ఆఫ్ సర్దార్, లుటేరా, హాలీడే సినిమాల్లో సోనాక్షి మెరిసింది.

More Telugu News