KCR: కేసీఆర్ చేసిన ఆ మూడు పనులతో ఢిల్లీలో మా పరువు పోయింది!: కొండా విశ్వేశ్వరరెడ్డి

  • పార్లమెంటులో తెలంగాణ ఎంపీలకు గౌరవం ఉండేది
  • కాళేశ్వరం విషయంలో మాచేత ఆందోళన చేయించారు
  • ట్రిపుల్ తలాక్ సమయంలో దొంగల్లా బయటకొచ్చాం

పార్లమెంటులో తెలంగాణ ఎంపీలంటే చాలా గౌరవం ఉండేదని ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కానీ కేసీఆర్ చేసిన మూడు పనుల కారణంగా రాష్ట్ర ఎంపీల పరువు గంగలో కలిసిందని ఆరోపించారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా ఆందోళన చేయాలని కేసీఆర్ సూచించారనీ, తాము ఆందోళనకు దిగితే కేంద్ర మంత్రి తమను పిలపించి ‘ఏమయ్యా.. మీ ముఖ్యమంత్రి తెలంగాణ తరఫున దరఖాస్తు చేయకుండా మేం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఎలా ఇవ్వగలం?’ అని ప్రశ్నించారని వెల్లడించారు. ఇలా తొలిసారి ఢిల్లీలో పరువు పోగొట్టుకున్నామని తెలిపారు.

ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు సమయంలో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించారనీ, ఓటింగ్ సమయంలో చల్లగా జారుకుని బయటకు వచ్చేయాలని సూచించారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తామంతా గుట్టుగా బయటకు వచ్చే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయామని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల రుణాలను నియంత్రించే ఎఫ్ఆర్ బీఎం చట్ట సవరణ విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని స్పష్టం చేశారు.

More Telugu News