Andhra Pradesh: ఆంధ్రాకు బయట ఎక్కడా రూపాయి అప్పుపుట్టడం లేదు.. ఇక్కడేమో చంద్రబాబు కోతలు కోస్తున్నారు!: విజయసాయిరెడ్డి

  • ఏపీ రుణాల పరిమితి ఎప్పుడో దాటింది
  • జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకే ఇక్కట్లు
  • చంద్రబాబు రాత్రీపగలు కోతలు కోస్తున్నారు

ఉద్యోగులకు జీతాలు, రోజువారీ ఖర్చుల కోసమే ఏపీ ప్రభుత్వం వద్ద నగదు లేదని వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. రుణాల పరిమితి దాటడంతో రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకే ప్రభుత్వం నానా కష్టాలు పడుతోందని విమర్శించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి రూ.50,000 కోట్లు, విశాఖ మెట్రో రైలుకు రూ.8,000 కోట్లు, కడప స్టీల్ ప్లాంటుకు రూ.12,000 కోట్లు, హైవేలకు వేలు కోట్లు అంటూ రాత్రీపగలు తేడా లేకుండా కోతలు కోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ఒకవైపు ఖాళీ ఖజానా వెలవెలబోతోంది. పరిమితి దాటినందున అప్పు కూడా పుట్టక జీతాలు, పెన్షన్లకే కనాకష్టమైన స్థితి. మరోవైపు అమరావతికి 50 వేల కోట్లు, విశాఖ మెట్రోకి 8 వేల కోట్లు, కడప ఉక్కుకు 12 వేల కోట్లు, హైవేలకు వేల కోట్లు అంటూ నాయుడు బాబు రేయింబవళ్ళు తెగ కోతలు కోస్తున్నాడు’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఇంతకుముందు అమరావతి అసెంబ్లీ డిజైన్లు ఇడ్లీ స్టాండ్ లా ఉందని విమర్శలు రావడంతో దాన్ని బోర్లించిన లిల్లీపువ్వులా మార్చారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News