Chandrababu: మహాకూటమిలోకి 18 పార్టీలు.. చంద్రబాబుతో నవీన్ పట్నాయక్ చర్చలు!

  • మహాకూటమికి పెరుగుతున్న ఆదరణ
  • వచ్చే నెల 11 తర్వాత ‘మహాకూటమి’ ఆవిర్భావం
  • ఎన్డీయేకు గుడ్‌బై చెప్పనున్న జేడీయూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడాలన్న ఆలోచన కార్యరూపం దాల్చబోతోంది. మహాకూటమిలో చేరేందుకు ఇప్పటికే 18 పార్టీలు సానుకూలత వ్యక్తం చేశాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 11న విడుదల కానున్నాయి. ఆ వెంటనే మహాకూటమి ఆవిర్భవించనుంది. చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, మహాకూటమిలో చేరే పార్టీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని  చెబుతున్నారు.

నిన్నమొన్నటి వరకు బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు కనిపించిన బీజేడీ కూడా మహాకూటమిలో చేరేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిపినట్టు సమాచారం. జనవరిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఆయన కూడా హాజరుకావాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అలాగే, కశ్మీర్‌లోని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కూటమిలో చేరనున్నట్టు సమాచారం. జేడీయూ కూడా త్వరలోనే ఎన్డీయేకు కటీఫ్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 11 తర్వాత 18 పార్టీలతో కూడిన మహాకూటమి ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తోంది.

More Telugu News