Telangana: తెలంగాణ వస్తే సీమాంధ్రులపై దాడులు జరుగుతాయని దుష్ప్రచారం చేశారు!: కేటీఆర్

  • అందుకే 2014 ఎన్నికల్లో మాకు ఓట్లు పడలేదు
  • కానీ టీఆర్ఎస్ పాలనకు ప్రజలు జై కొట్టారు
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు కట్టబెట్టారు

ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రుల మీద దాడులు జరుగుతాయనీ, ఆస్తులు లాక్కుంటారని కొందరు దుష్ప్రచారం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడులు తరలిపోతాయనీ, రియల్ ఎస్టేట్ పడిపోతుందని కొందరు బెదిరింపులకు దిగారని వ్యాఖ్యానించారు. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక సీమాంధ్రులకు చీమకు జరిగినంత అపకారం కూడా జరగలేదని తెలిపారు. కూకట్ పల్లిలో ఈ రోజు నిర్వహించిన సీమాంధ్రుల సంఘీభావ సభలో కేటీఆర్ మాట్లాడారు.

2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొత్తం 24 స్థానాలకు గానూ సికింద్రాబాద్, మల్కాజ్ గిరి సీట్లలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారని కేటీఆర్ తెలిపారు. అప్పట్లో కొందరు చేసిన విష ప్రచారం నేపథ్యంలో టీఆర్ఎస్ కు ఓట్లు పడలేదన్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 16 నెలల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించామని పేర్కొన్నారు.

బల్దియాపై గులాబీ జెండా ఎగరకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పానన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చెవి కోసుకుంటానని సీపీఐ నేత నారాయణ, రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత వీరిద్దరూ అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.

More Telugu News