Congress: ఒక్కగానొక్క కూతురి నిశ్చితార్థానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు అప్పట్లో కేసీఆర్ యత్నించారు.. పెద్దపెద్ద లాయర్లను తెచ్చారు!: రేవంత్ రెడ్డి

  • రాజకీయంగా వేధింపులతో నాకు సమస్య లేదు
  • కాంగ్రెస్, టీడీపీలు నన్ను గౌరవించాయి
  • అనుభవం లేకుండానే ఎన్టీఆర్, రాజీవ్ రాణించారు

రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టే కేసులను ఎదుర్కొనే దమ్ము తనకు ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ తన కుమార్తె నిశ్చితార్థానికి హాజరుకాకుండా అడ్డుకునేందుకు అప్పట్లో సీఎం కేసీఆర్ యత్నించారని ఆరోపించారు. అందుకోసం ఢిల్లీ నుంచి పెద్దపెద్ద లాయర్లను రంగంలోకి దించారనీ, తనకు బెయిల్ రాకుండా శతవిధాలా ప్రయత్నించారని విమర్శించారు. తనకు ఉన్న ఒక్కగానొక్క కుమార్తె నిశ్చితార్థానికి హాజరయితే కేసీఆర్ కు వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. తన కుమార్తె నిశ్చితార్థానికి హాజరుకాకుండా అడ్డుకుని రాక్షసానందం పొందేందుకు కేసీఆర్ యత్నించారని ఆరోపించారు. 2006 నుంచి ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని గుర్తించి టీడీపీ గౌరవించిందనీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తనను ఆహ్వానించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కల్పించారని చెప్పారు.

తన దూకుడుపై అందరిలోనూ తప్పుడు అభిప్రాయం కలిగేలా టీఆర్ఎస్ రహస్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఏ పదవిని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రభుత్వం నడిపారని గుర్తుచేశారు.

అలాగే మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ రాజకీయ అనుభవం లేకుండానే ప్రధాని బాధ్యతలు చేపట్టారని తెలిపారు. రాజీవ్ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేశారనీ, పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడిగా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా తాను పనిచేశానని చెప్పారు. ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.

More Telugu News