Sujana Chowdary: టీడీపీలో మళ్లీ దాడుల కలకలం...ఎంపీ సుజనా చౌదరి సంస్థల్లో ఈడీ తనిఖీలు

  • నాగార్జున హిల్స్‌లో ఉన్న బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌లో సోదాలు
  • డొల్ల కంపెనీల ద్వారా కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు
  • ఉద్యోగులనే డైరెక్టర్‌లుగా పెట్టి షెల్‌ కంపెనీలు నడిపినట్టు గుర్తింపు

తెలుగుదేశం పార్టీలో మళ్లీ దాడుల కలకలం. పార్టీ ఎంపీ సుజనా చౌదరి సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం కలకలానికి కారణం. డొల్ల కంపెనీలను స్థాపించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాగార్జున హిల్స్‌లో ఉన్న బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ సంస్థలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులనే డైరెక్టర్‌లుగా చూపించి గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌, తేజస్విని ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బు మళ్లించారన్న ఆరోపణలపై ఆరాతీశారు. పలు బ్యాంకుల నుంచి రూ.304 కోట్లు దుర్వినియోగం చేశారన్నది మరో ఆరోపణ.

ఎటువంటి కొనుగోళ్లు జరపకుండానే కేవలం రశీదు రూపంలో డబ్బు మళ్లించినట్టు వచ్చిన ఆరోపణలపై 2016 ఫిబ్రవరిలోనే సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గత అక్టోబరులో ఈడీ సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున హార్డ్‌ డిస్క్‌లు, ఫైల్స్‌తోపాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత సోదాల్లోను మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

More Telugu News