CBI: ‘జనధ్వని’తో వచ్చేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ?

  • లక్ష్మీనారాయణ పార్టీ పేరుపై ఊహాగానాలు
  • జనధ్వని, వందేమాతరం పేర్లు చక్కర్లు
  • 26న పార్టీ ప్రకటన?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఏ పేరు పెడతారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇప్పుడా చర్చకు ముగింపు అన్నట్టుగా ‘జనధ్వని’ పేరు పెట్టబోతున్నారంటూ తాజాగా ఊహాగానాలు మొదలయ్యాయి.

జేడీగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన ఆయన జేడీ (జన ధ్వని) కలిసి వచ్చేలా పార్టీ పేరు పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు ‘వందేమాతరం’ అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే, లక్ష్మీనారాయణ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించడం లేదు. అలాగని ఖండించకపోవడంతోనూ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

ఈ నెల 26న లక్ష్మీనారాయణ పార్టీ పేరును ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కొందరికి ఆహ్వానాలు కూడా అందినట్టు చెబుతున్నారు. ‘జేడీ’ (జనధ్వని) వైపు మొగ్గుచూపుతున్న లక్ష్మీనారాయణ.. 26 నాటి సమావేశంలో పార్టీ పేరుపై అభిప్రాయ సేకరణ కూడా చేయనున్నట్టు చెబుతున్నారు.  

More Telugu News