Telangana: 14 కాదు, 8 కాదు... టీజేఎస్ కు మిగిలింది 4 సీట్లే!

  • తొలుత 14 సీట్లు కోరి, 8 సీట్లకు సర్దుకున్న టీజేఎస్
  • ఆ 8 కూడా ఇవ్వకుండా బరిలో కాంగ్రెస్ రెబల్స్
  • 4 చోట్ల పోటీ, 5 చోట్ల స్నేహపూర్వక పోటీ

తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీకి చివరకు మిగిలింది నాలుగు స్థానాలే. తొలుత 14 సీట్లను కోరి, ఆపై 8 సీట్లకు సర్దుకున్న ఆ పార్టీ, ఇప్పుడు నాలుగు చోట్ల మాత్రమే ప్రధానంగా బరిలో నిలిచింది. మరో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ తో స్నేహపూర్వక పోటీ తప్పడం లేదు. 14 మందికి బీఫారమ్ లు ఇచ్చి నామినేషన్ వేయించిన పార్టీ పెద్దలు, చివరకు 5 స్థానాల నుంచి అభ్యర్థులు తమ నామినేషన్ లను విత్ డ్రా చేసుకునేలా చూశారు.

 నిన్న ఉదయం నుంచి కాంగ్రెస్ నాయకులతో పలుమార్లు భేటీ అయిన కోదండరామ్, తమకు ఇస్తామన్న 8 సీట్లనూ వదిలేయాలని కోరారు. అయినప్పటికీ, కాంగ్రెస్ మెత్తబడలేదు. తమకు వరంగల్ ఈస్ట్, దుబ్బాక, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఇవ్వాలని కోరిన కోదండరామ్, అక్కడి నుంచి అభ్యర్థులను వెనక్కి తీసుకునేలా మాత్రం కాంగ్రెస్ ను ఒప్పించలేకపోయారు.

ఇక టీజేఎస్ బీఫారాలతో నామినేషన్లు వేసిన మిర్యాలగూడ, మహబూబ్ నగర్, చెన్నూరు అశ్వారావు పేట, మెదక్ స్థానాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక ఇప్పుడు ఆ పార్టీకి ప్రధానంగా మిగిలింది మల్కాజిగిరి, వర్ధన్నపేట, సిద్ధిపేట, అంబర్ పేట మాత్రమే.

More Telugu News