KCR: కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాలపై కర్ర పెత్తనం చేయాలని చూస్తున్నాయి!: సీఎం కేసీఆర్

  • కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం అంధకారమే
  • నెలరోజుల్లోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహణ
  • ఇచ్చోడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్

తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారం అప్పగిస్తే రాష్ట్రం చీకటిమయం అయిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ ను తెలంగాణలో అందిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే పంచాయితీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడలో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

టీఆర్ఎస్ ను మరోసారి గెలిపిస్తే ఇప్పుడు అందిస్తున్న పెన్షన్లను రెట్టింపు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపామనీ, ఈ విషయంలో కేంద్రం సహకరించడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని, తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దామని తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాలపై కర్ర పెత్తనం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. వచ్చేఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో అన్ని సీట్లను టీఆర్ఎస్ దక్కించుకుంటే.. కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతామని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఢిల్లీ మెడలు వంచి ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News