KCR: ‘కల్యాణలక్ష్మి’ని భయపడుతూనే ప్రారంభించా.. కానీ అది సక్సెస్ అయింది!: సీఎం కేసీఆర్

  • తెలంగాణ చీకటిగా మారుతుందన్నారు
  • రూ.12,000 కోట్లు వెచ్చించి విద్యుత్ తెచ్చాం
  • ఖానాపూర్ బహిరంగ సభలో కేసీఆర్

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే వికలాంగులకు రూ.2,016 అందజేస్తామనీ, నిరుద్యోగులకు రూ.3,016 అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకం వంటి పథకానికి ఖర్చు ఎంత అవుతుందో అని భయపడుతూనే ప్రారంభించామని వెల్లడించారు.

తొలుత దళిత, మైనారిటీలకు వీటిని అందించాలని భావించామని ముఖ్యమంత్రి అన్నారు. అయితే ప్రజల నుంచి విశేష ఆదరణ రావడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో మిగతా సామాజిక వర్గాల్లోని ప్రజలకు కల్యాణ లక్ష్మిని విస్తరించామన్నారు. ఈ పథకం ఇప్పుడు విజయవంతమయిందని అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఈ రోజు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

రైతు బంధు, కల్యాణలక్ష్మి లేదా షాదీముబారక్ లబ్ధిదారులు రూపాయి లంచం చెల్లించలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు తెలివి లేదు, పరిపాలన చేతకాదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తనను దూషించారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పగలురాత్రి కష్టపడి ప్రణాళికలు వేశానని అన్నారు.

ఇందుకోసం రూ.12,000 కోట్లు ఖర్చుపెట్టానని గుర్తుచేసుకున్నారు. తమ అకుంఠిత దీక్ష కారణంగానే 24 గంటలపాటు విద్యుత్ ను అందజేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణను  తాను పోరాడి తెచ్చాననీ, ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తనకు తెలుసని సీఎం వ్యాఖ్యానించారు.

More Telugu News