Andhra Pradesh: ఓటుకు నోటు కేసులో ఏపీ, తెలంగాణ పోలీసులు నన్ను వేధిస్తున్నారు!: జెరుసలేం మత్తయ్య

  • రెండు రాష్ట్రాలు ఇప్పుడు కుమ్మక్కయ్యాయి
  • ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించండి
  • సుప్రీంకోర్టుకు విన్నవించిన జెరుసలేం మత్తయ్య

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కుమ్మక్కు అయ్యాయని నిందితుడు జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన తనను ఏపీ, తెలంగాణ పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. తెలుగు రాష్ట్రాల పోలీసులు జరిపే విచారణపై తనకు నమ్మకం లేదనీ, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. సుప్రీంకోర్టులో ఈ రోజు కేసు విచారణ సందర్భంగా మత్తయ్య తన తరఫు వాదనలను స్వయంగా వినిపించుకున్నారు.

తన ఇంటి చుట్టూ పోలీసులు 24 గంటలపాటు తిరుగుతూ తనను, తన భార్యను వేధిస్తున్నారని వాపోయారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తక్షణమే మత్తయ్యకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. మత్తయ్య ఫిర్యాదును స్వీకరించి తగిన భద్రతను కల్పించాలని స్పష్టం చేసింది. అనంతరం మత్తయ్య తరఫున అమికస్ క్యూరీగా సిద్ధార్థ దవే అనే లాయర్ ను నియమించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 28కి వాయిదా వేసింది.

తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా రూ.50 లక్షల నగదుతో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కలిశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్పులు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో ఈ కేసు తొలుత హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లింది.

More Telugu News