కోడికత్తితో ఇప్పటికే పరువు పోగొట్టుకున్నారు.. మిగిలిన పరువునైనా కాపాడుకోండి: యరపతినేని

22-11-2018 Thu 11:12
  • కోడికత్తి దాడితో మాకు సంబంధం ఏమిటి?
  • ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమే
  • వైసీపీపై మండిపడ్డ యరపతినేని

వైసీపీ నేతలపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో దాడి జరిగితే... ఆ దాడితో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి ఆదినారాయణరెడ్డికి, తనకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కోడికత్తి డ్రామాతో పరువుపోగొట్టుకున్నారని, మిగిలిన పరువునైనా కాపాడుకోవాలని హితవు పలికారు.

ఈనెల 23న మంత్రి నారా లోకేష్ గురజాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రెంటచింతలలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని చెప్పారు. ఈ సమావేశానికి మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, టీడీపీ మండలాధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, ఎంపీపీ జీజాతుల నాయక్ తదితరులు హాజరయ్యారు.