Ajmal Kasab: ఆ ముఖం నాకింకా గుర్తుంది.. కసబ్ నవ్వుతూ కాల్పులు జరిపాడు: 26/11 ఘటనను గుర్తు చేసుకున్న రైల్వే అనౌన్సర్

  • కాల్పులు జరిపిన వెంటనే అప్రమత్తమైన దీపక్
  • రైల్వే కంట్రోలు రూముకు ఫోన్
  • 27 గంటలపాటు సహాయక చర్యలు
  • బ్రేవరీ అవార్డుతో సత్కరించిన రైల్వే

నవంబరు 26, 2008లో ముంబై రైల్వే స్టేషన్‌లో పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కాల్పులు జరిపిన ఘటనను ఆ రోజు స్టేషన్‌లో అనౌన్సర్‌గా ఉన్న బబ్లూ కుమార్ దీపక్ గుర్తు చేసుకున్నారు. ఓ కాలేజీ కుర్రాడు వీడియో గేమ్ ఆడుతున్నట్టు నవ్వుతూ ప్రయాణికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడని పేర్కొన్నారు.

చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)లో 26 నవంబరు 2008లో ప్రయాణికులపై కసబ్ దారుణ మారణకాండకు పాల్పడ్డాడు. ఈ ఘటనను దీపక్ కళ్లారా చూశారు. ఈ ఘటనలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సీఎస్‌ఎంటీ ఎంట్రీ గేట్ వద్ద నవ్వుతూ కాల్పులు ప్రారంభించగానే దీపక్ అప్రమత్తమయ్యారు. వెంటనే రైల్వే కంట్రోలు రూముకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

నిజానికి ఆ రోజున దీపక్ బైకుల్లా రైల్వే స్టేషన్‌లో విధుల్లో ఉన్నారు. అయితే, సీఎస్ఎంటీలో సిబ్బంది కొరత ఉండడంతో ఉన్నతాధికారులు ఆయనకు అక్కడ కూడా విధులు నిర్వర్తించాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఉదయం ఏడు గంటలకు బైకుల్లాలో విధులకు వచ్చిన ఆయన మూడు గంటలకు ముగించుకుని సీఎస్ఎంటీకి వెళ్లి విధుల్లో చేరారు.

రాత్రి 9:30 గంటలు. అప్పుడే ముంబై-హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఫ్లాట్‌ఫాంను వీడింది. ముంబై-పూణె ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. 13వ నంబరు ప్లాట్‌ఫాంపై అకస్మాత్తుగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఆ వెంటనే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. ‘‘చాలామంది నా ముందే నేలకొరిగారు. కసబ్ నవ్వుతూ నేను కాలిస్తే ఇలానే ఉంటుంది’’ అని అరుస్తున్నాడు. గమనించిన దీపక్ వెంటనే అప్రమత్తమయ్యారు. రైల్వే కంట్రోలు రూముకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అనంతరం ప్రయాణికులను హెచ్చరిస్తూ ప్రకటన చేశారు. 13వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి అందరూ వెళ్లిపోవాలని కోరారు.

ఘటన తర్వాత దాదాపు 27 గంటలపాటు స్టేషన్‌లోనే ఉన్న దీపక్ సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ‘‘నాకో విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. ఉగ్రవాదులు గుళ్లవర్షం కురిపిస్తున్నా రైల్వే పోర్టర్లు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సాయం చేశారు’’ అని దీపక్ గుర్తు చేసుకున్నారు. ‘‘నాటి ఘటన నాకింకా గుర్తుంది. కసబ్ నవ్వుతూ కాల్పులు జరిపాడు. ఫ్రెష్‌గా ఉన్నాడు’’ అని పేర్కొన్నారు. కాగా, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని తెలిసినా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుని పలువురి ప్రాణాలు కాపాడిన దీపక్‌‌ను సెంట్రల్ రైల్వే ధైర్యవంతుడు అవార్డుతో సత్కరించింది.

More Telugu News