Russia: విమానం ఢీకొని వ్యక్తి మృతి.. టేకాఫ్ అవుతుండగా ఘటన!

  • మృతి చెందిన వ్యక్తిని స్పెయిన్ వాసిగా గుర్తింపు
  • మరో విమానం ఎక్కించే సమయంలో ఘటన
  • దర్యాప్తు జరుపుతున్న అధికారులు

విమానం ఢీకొని వ్యక్తి మరణించిన ఘటన రష్యాలోని మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విమానం టేకాఫ్ అవుతుండగా అతడు అకస్మాత్తుగా రన్‌వేపైకి రావడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఏరోఫ్లోట్ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం ఏథెన్స్ వెళ్లేందుకు టేకాఫ్ అవుతోంది. అదే సమయంలో స్పెయిన్‌కు చెందిన ఆల్బర్ట్ యెప్రెమ్‌యాన్ ఒక్కసారిగా రన్‌వేపైకి రావడంతో విమానం ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటనతో విమానాశ్రయాన్ని కొంత సమయం పాటు మూసివేశారు.

స్పెయిన్ నుంచి వచ్చిన ఆల్బర్ట్ విమానంలో సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో విమానం మాస్కోలో ల్యాండైన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆర్మేనియా రాజధాని యెరెవాన్ వెళ్లే విమానాన్ని ఎక్కించేందుకు తీసుకెళ్తుండగా అతడు ఒక్కసారిగా రన్‌వే పైకి రావడంతో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆల్బర్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News