Telangana: మహాకూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు.. మాకు 100 సీట్లు గ్యారెంటీ!: నాయిని నర్సింహారెడ్డి

  • చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకున్నారు
  • ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఓట్లడుగుతారు
  • దేవరకొండ ప్రజాఆశీర్వాద సభలో వెల్లడి

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 100కు పైగా సీట్లను సాధిస్తుందనీ, నల్లగొండను క్లీన్ స్వీప్ చేస్తామని మంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి ఎన్నికల్లో మహాకూటమి(ప్రజా కూటమి) అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకంతో దేవరకొండ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని మంత్రి అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో నాయిని మాట్లాడారు.

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు నాయుడు లేఖలు రాసి అడ్డుకున్నారని నాయిని నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్, టీడీపీ నేతలు ఏ రకంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీసేది లేదని ఎద్దేవా చేశారు. దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యమని నాయిని అన్నారు.

More Telugu News