Bollywood: మీటూ ఎఫెక్ట్.. నటుడు అలోక్ నాథ్ పై రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు!

  • రేప్ చేసినట్లు ఆరోపించిన వినీతా నందా
  • పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు
  • నోటీసులకు ఇంకా స్పందించని నటుడు

సినీపరిశ్రమలో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం చాలామంది నటులు, దర్శకుల జాతకాలను మార్చేసింది. ఈ ఉద్యమం దెబ్బకు నటులు నానపటేకర్, అలోక్ నాథ్ లతో పాటు దర్శకుడు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ లు కీలక ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అలోక్ నాథ్ తనపై అత్యాచారం చేశాడని నిర్మాత, నటి వినీతా నందా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆమె పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓషివారా పోలీసులు అలోక్ నాథ్ పై రేప్ కేసు నమోదుచేశారు.

అలోక్ నాథ్ పై వినీతా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన భార్య గతంలో పోలీసులను ఆశ్రయించారు. అలాగే అలోక్ నాథ్ వినీతాపై పరువునష్టం దావాను కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలోక్ నాథ్ పై కేసు నమోదుచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, అలోక్ నాథ్ ను ఇప్పటికే సీఐఎన్‌టీఏఏ(సినీ, టీవీ ఆర్టిస్ట్‌ల సంఘం) బహిష్కరించింది. లైంగిక వేధింపుల వ్యవహారంలో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పంపిన నోటీసుపై అలోక్ ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News