Telangana: ‘తెలంగాణను వదల బొమ్మాళీ.. వదలా’ అని చంద్రబాబు అంటున్నారు!: సీఎం కేసీఆర్

  • ఓసారి ఈ భూతాన్ని నేను తరిమికొట్టాను
  • ఈసారి తరమాల్సిన బాధ్యత ప్రజలదే
  • జడ్చర్ల ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్

పాలమూరు జిల్లాలో ఇప్పుడు ప్రాజెక్టుల నిర్మాణం 90 శాతం పూర్తి అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వం చొరవతో ఇప్పుడు జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తోందని అన్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరులో ముంబైకి బస్సులు ఆగిపోయే రోజులు మరెంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

పాలమూరు జిల్లాలో కరువు తీరేందుకు టీఆర్ఎస్ నేత లక్ష్మారెడ్డి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని సీఎం కితాబిచ్చారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో పంటలు పండాలనీ, ఇందులో పాలమూరులోనే 20 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే జడ్చర్లలో 1.50 లక్షల ఎకరాల్లో పంటలకు సాగు నీరు అందించేందుకు ఉద్దండాపూర్ లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈ జిల్లాలో కొంతమందిని పోటీకి దించాడని కేసీఆర్ అన్నారు.

పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణను ‘వదల బొమ్మాళీ.. వదలా’ అంటున్నారని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ భూతాన్ని ఓసారి తాను తరిమికొట్టాననీ, ఇంకోసారి తరిమికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైనే ఉందని వ్యాఖ్యానించారు. పాలమూరులో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ఏ ముఖం పెట్టుకుని పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు.

More Telugu News