Andhra Pradesh: కృష్ణా జిల్లాలో ఉల్లిపాలెం-భవానీపురం వారధిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

  • రూ.77 కోట్లతో పూర్తయిన నిర్మాణం
  • మచిలీపట్నానికి తగ్గనున్న దూరం
  • వంతెన దెబ్బతినకుండా ప్రత్యేక సాంకేతికత

దివిసీమ ప్రజల చిరకాల కోరిక ఈరోజు వెరవేరింది. కృష్ణా జిల్లాలోని ఉల్లిపాలెం, భవానీపురం మధ్య కృష్ణానదిపై నిర్మించిన భారీ వంతెనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. దాదాపు రూ.77 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు.  దాదాపు 1.6 కి.మీ పొడవుతో కృష్ణా నదిపై ఈ వంతెనను నిర్మించారు. 2016, జనవరిలో మొదలైన ఈ వారధి నిర్మాణం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తయింది.

వంతెన నిర్మాణంలో భాగంగా అధికారులు అత్యాధునిక పద్ధతులను పాటించారు. సముద్రానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో 68 పిల్లర్లు, 15 శ్లాబులు, 60 గడ్డర్లతో వంతెనను నిర్మించారు. తీరప్రాంతం కావడంతో వంతెన దెబ్బతినకుండా ప్రత్యేక సాంకేతికతను వాడారు. వంతెనపై వరద ప్రభావం లేకుండా రూ.3 కోట్లతో అప్రోచ్ రోడ్డును నిర్మించారు.

ఈ వంతెన నిర్మాణంతో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల నుంచి జిల్లా కేంద్రం మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రకృతి విపత్తులు ఎదురయినప్పుడు వేగంగా సహాయక చర్యలు చేపట్టడం వీలవుతుంది. కాగా, వారధి ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News