KCR: కేసీఆర్ హెలికాప్టర్ ఖర్చులను కూడా లెక్కించండి: జిల్లా రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశం

  • ఏడబ్యూ169 హెలికాప్టర్ ను ఉపయోగిస్తున్న కేసీఆర్
  • హెలికాప్టర్ బుకింగ్స్ ను ఎన్నికల ఖర్చులో చేర్చాలంటూ ఎన్నకల సంఘం ఆదేశం
  • 29 ప్రాంతాలకు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ వెక్ట్రా అనే సంస్థకు చెందిన ఏడబ్ల్యూ169 హెలికాప్టన్ ను ఆయన తన ప్రయాణాలకు ఉపయోగిస్తున్నారు. 10 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఈ హెలికాప్టర్ కు ఉంది.

మరోవైపు, కేసీఆర్ హెలికాప్టర్ బుకింగ్స్ ను కూడా ఎన్నికల ఖర్చులో చేర్చాలంటూ అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా హెలిపాడ్లను నిర్మించేలా జిల్లా కలెక్టర్లను, రిటర్నింగ్ అధికారులను ఆదేశించాలని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి నవంబర్ 17న భారత ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈసీ... హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా హెలిపాడ్లను నిర్మించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే కేసీఆర్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 29 ప్రాంతాలకు ఆయన హెలికాప్టర్ ద్వారా ప్రయాణించి, ప్రచారం నిర్వహిస్తున్నారు. నవంబర్ 19న ఖమ్మంలో ప్రారంభమైన ఆయన ప్రచారం... నవంబర్ 25న ఇబ్రహీంపట్నంలో ముగియనుంది. 

More Telugu News