Chandrababu: టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నియోజకవర్గాల్లోకి రానివ్వని పరిస్థితి ఉంది: ఏపీ సీఎం చంద్రబాబు

  • ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ తిరస్కరణ
  • సమర్థవంతంగా పనిచేసే వారినే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు
  • తనతోపాటు అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని స్పష్టీకరణ

‘అధికారం అప్పగించిన ప్రజలు తమ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అందుబాటులో లేని వారిని తిరస్కరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నియోజక వర్గాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. వారిని ప్రజలు రానివ్వడం లేదు. ఇందుకు కారణం అధికారం మత్తులో ప్రజలకు అందుబాటులో లేకపోవడమే కారణం’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి నుంచి పార్టీ నేతలతో సీఎం బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలు పొందే విషయంలో తనతోపాటు అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని, ఎవరికీ  మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. సమర్థవంతంగా పనిచేసిన నేతలనే ప్రజలు గౌరవిస్తారని తెలిపారు. ఈ ఐదేళ్లలో పార్టీకి చెందిన పలువురికి వారి వారి సమర్థత మేరకు పదవులు ఇచ్చానని, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించానని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరింత మందికి పదవులు కట్టబెడతానని తెలిపారు.

నెల్లూరులో నిర్వహించిన ధర్మపోరాట సభను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన మూడు సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 81 వేల మంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని, దీన్ని రెట్టింపు చేయాలని కార్యకర్తలకు సూచించారు. బూత్‌ కన్వీనర్ల శిక్షణ కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు.

సీబీఐలో బీజేపీ ప్రభుత్వం జోక్యం అధికమైందని, పార్టీ పెద్దలు సీబీఐని కలెక్షన్‌ బ్యూరోగా మార్చేశారని మండిపడ్డారు. జగన్‌, పవన్‌, కేసీఆర్‌ ఎజెండా ఒక్కటి కాబట్టే వారు తెలుగుదేశం పార్టీని తప్ప మోదీని పల్లెత్తు మాట అనరన్నారు. బీజేపీ యేతర పార్టీలు కలవకుండా వీరు చేయని ప్రయత్నం లేదని విమర్శించారు.

More Telugu News