Smart Phone: ఇకపై మీ స్మార్ట్ ఫోన్ తోనే పాలల్లో కల్తీని కనిపెట్టొచ్చు... హైదరాబాద్ ఐఐటియన్ల సృష్టి!

  • స్మార్ట్ ఫోన్ ఆధారిత సెన్సర్ తయారీ
  • 99.71 శాతం కచ్చితమైన ఫలితాలు
  • ప్రచురించిన ఫుడ్ అనలిటికల్ మెథడ్స్ జర్నల్

అతి త్వరలోనే మీ స్మార్ట్ ఫోన్ ను వినియోగించి, మీరు వాడే పాలల్లోని నాణ్యతను ఇట్టే తెలుసుకునే సౌకర్యం దగ్గర కానుంది. హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రీసెర్చర్లు స్మార్ట్ ఫోన్ ఆధారిత సెన్సర్ ను సృష్టించారు. ఇది పాలల్లోని కల్తీని ఇట్టే పట్టేస్తుంది. ఈ దిశగా ఐఐటియన్లు చిప్ ను తయారు చేశారు. దీనికి పరీక్షలు నిర్వహించగా, 99.71 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయి.

ఈ రీసెర్చ్ టీమ్ కు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద సింగ్ నేతృత్వం వహించారు. ఈ చిప్ 'ఎలక్ట్రో స్పైనింగ్' ఆధారంగా పనిచేస్తుందని, పాలల్లోని కల్తీ శాతాన్ని ఇది కనిపెడుతుందని అన్నారు. దీనికోసం ప్రొటోటైమ్ స్మార్ట్ ఫోన్ ఆధారిత అల్గారిథమ్ ను రూపొందించామని, సెన్సర్ కు ఉంచే స్ట్రిప్స్ ను పాలల్లోకి ముంచి, ఆపై ఫోన్ కెమెరాతో ఫోటో తీస్తే, పీహెచ్ (అసిడిటీ) రేంజ్ ఏ మేరకు ఉందన్న విషయం తెలుస్తుందని తెలిపారు.

ఈ రీసెర్చ్ టీమ్ లో సౌమ్య, శివరామ కృష్ణ తదితరులు భాగం కాగా, వీరి రీసెర్చ్ ఫలితాలు ఫుడ్ అనలిటికల్ మెథడ్స్ జర్నల్, తన నవంబర్ సంచికలో ప్రచురించింది.

More Telugu News