KCR: మళ్లీ కుర్చీదక్కదన్న భయంతోనే కేసీఆర్‌ యజ్ఞయాగాలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా

  • సీఎంలో ఓటమి భయానికి ఇదే నిదర్శనం
  • రాజుల కాలంలో యుద్ధానికి ముందు ఇలా చేసేవారు
  • కేసీఆర్‌ యుద్ధం ప్రారంభించాక యజ్ఞం చేస్తున్నారని విమర్శ

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓటమి భయం వెంటాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. 'పూర్వం రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఇలా యజ్ఞయాగాదులు చేసేవారు. కేసీఆర్‌ యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో చేస్తున్నారంతే’ అని ఎద్దేవా చేశారు. మళ్లీ కుర్చీదక్కదని కేసీఆర్‌ భయపడుతున్నారనేందుకు ఇదే నిదర్శనమన్నారు.

ముషీరాబాద్‌ నియోజకవర్గం అడిక్‌మెట్‌ డివిజన్‌ ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు వెళ్లేముందు వంద సీట్లు గెలుస్తామని బీరాలు పలికిన కేసీఆర్‌లో ఇప్పుడా ధైర్యం కనిపించడం లేదన్నారు. రాను రాను పరిస్థితి వ్యతిరేకంగా మారుతోందన్న ఉద్దేశంతోనే ఫామ్‌హౌస్‌లో యజ్ఞయాగాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రజలు ఐదేళ్లు పాలించాలని సీఎం కేసీఆర్‌కు అధికారం అప్పగిస్తే ఆయన చేతులెత్తేశారని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం అంకితభావంతో పనిచేసే పార్టీ బీజేపీ అని, రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు.

More Telugu News