Hyderabad: ఘరానా మోసగత్తె.. పనిమనిషి నుంచి పక్కింటి వారి వరకూ బాధితులే!

  • విలాసవంతమైన ఇళ్లలో ఉంటూ కార్లలో తిరిగే ఆంచల్
  • పలువురు పేదలను మోసం చేసిన వైనం
  • పాలు పోసే వ్యక్తి ఫిర్యాదుతో గుట్టంతా వెలుగులోకి

ఆమె ఉండేది విలాసవంతమైన అపార్టుమెంట్లలో... తిరిగేది ఖరీదైన కార్లలో... అయితేనేం, తన మాయమాటలతో ఇంట్లో పనిచేసే పనిమనిషి నుంచి పక్కింటి, ఎదురింటి వారిని, ఐటీ ఇంజనీర్లను మోసం చేసి లక్షలకు లక్షలు గుంజింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది.

హైదరాబాదు శివారు గచ్చిబౌలి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఆంచల్ గుప్తా అనే యువతి, తన భర్త రత్నకుమార్, పదేళ్ల కుమార్తెతో కలసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. వీరి ఇంట్లో అంజమ్మ అనే మహిళ, గత సంవత్సరం పనిమనిషిగా చేరగా, ఆమెకు తక్కువ ధరకు స్థలం ఇప్పిస్తానంటూ రూ. 2 లక్షలు తీసుకుంది. తనకు పాలు పోసే వ్యక్తి, స్నేహితుడికి పిల్లలు లేకపోగా, అమెరికా నుంచి ప్రత్యేక మందులు తెప్పిస్తానని చెబుతూ రూ. 2.90 లక్షలు కాజేసింది. ఔషధం కానీ, డబ్బులుకానీ వెనక్కు ఇవ్వకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించగా, ఆంచల్ మోసాలన్నీ వెలుగులోకి వచ్చాయి.

చందానగర్ కు చెందిన ఐటీ ఇంజనీర్ స్వప్న నుంచి యూఎస్ వీసా ఇప్పిస్తానని చెబుతూ రూ. 6 లక్షలు, మాదాపూర్ లోని ఓ స్విమ్మింగ్ కోచ్ కి రూ. 50 లక్షల హోమ్ లోన్ ఇప్పిస్తానంటూ రూ. 4.5 లక్షలు ఆంచల్ తీసుకుంది. నిందితురాలిపై చందానగర్, మాదాపూర్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయని చెప్పిన పోలీసులు, ఆమెను రిమాండ్ కు తరలించామని, ఆమె చేతిలో ఇంకా ఎంత మంది మోసపోయారో విచారిస్తున్నామని అన్నారు.

More Telugu News