Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడ్డ బస్సు.. 12 మంది మృతి!

  • తాల్చేల్ నుంచి కటక్ వెళ్తుండగా ప్రమాదం 
  • మహానది వంతెనపై గేదెను ఢీకొట్టిన బస్సు  
  • సుమారు 40 అడుగుల దిగువకు పడ్డ బస్సు 

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కటక్ లోని మహానది వంతెనపై గేదెను ఢీకొట్టిన బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.జగన్నాథ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు అనుగుల్ జిల్లా తాల్చేల్ నుంచి కటక్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి సుమారు 40 అడుగుల దిగువకు నదిలోకి బస్సు పడిపోయింది. నదిలో నీరు లేనట్టు సమాచారం. బస్సులో 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనాస్థలిలో విపత్తు నిర్వహణ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపడుతున్నారు. ఘటనాస్థలిలో 10 అంబులెన్స్ లను అధికారులు సిద్ధంగా ఉంచారు. బస్సులో నుంచి 12 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మరో 20 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. కాగా, బస్సు ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

More Telugu News