kcr: కేసీఆర్ ను పొగుడుతూ.. మనల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు: మోదీపై చంద్రబాబు నిప్పులు

  • కేసీఆర్, జగన్, పవన్ లతో బీజేపీకి లోపాయికారీ ఒప్పందం ఉంది
  • బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలను ఏకం చేస్తున్నా
  • తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయలేదు?

ప్రధాని మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను పొగుడుతూ మనల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఆనాడు బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని... కానీ, బీజేపీ ఏపీని దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ. 15వేల కోట్ల రెవెన్యూ లోటును కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను అమలు చేయాలని 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా... ఫలితం దక్కలేదని చెప్పారు. విభజన హామీల సాధనకు టీడీపీ ఎంపీలు ఎంతో పోరాడారని తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన ధర్మపోరాట సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

బెదిరింపులకు దిగుతూ, రాష్ట్రంలో ఐటీ దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల కోసం తాము పోరాడుతుంటే... ఐటీ దాడులతో భయపెడతారా అని ప్రశ్నించారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికే దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్ లతో ఒప్పందం కుదుర్చుకుని... టీడీపీని నాశనం చేయాలని బీజేపీ యత్నిస్తోందని దుయ్యబట్టారు.

వైసీపీ నేతలు మోదీని విమర్శించరని... రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం కూడా చేయరని చంద్రబాబు విమర్శించారు. తెలంగాణ  ఎన్నికల్లో వైసీపీ ఎందుకు పోటీ చేయలేదని ఆయన నిలదీశారు. హైదరాబాదును ప్రపంచపటంలో నిలబెట్టింది తానేనని చెప్పారు.

More Telugu News