ఏపీ ప్రభుత్వంపై మాజీ అధికారుల అక్కసు అందుకే: టీడీపీ విమర్శలు

20-11-2018 Tue 09:24
  • ఐవైఆర్, అజయ్ కల్లం, విజయబాబులపై  టీడీపీ మండిపాటు
  • అప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు బురద జల్లుతారా?
  • వారి మెదళ్లలో చిప్ పాడైంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చీటికిమాటికి విమర్శలు గుప్పిస్తున్న మాజీ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, విజయబాబులపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆశించిన పదవులు ఇవ్వనందుకే ప్రభుత్వంపై కక్షగట్టి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వీరంతా మూకుమ్మడిగా ప్రభుత్వంపై బురద జల్లడం మానుకుంటే రాష్ట్రం మరింత వేగిరంగా అభివృద్ధి చెందుతుందని శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. ఓ మీడియా సంస్థకు కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలు ఇచ్చారని, వేల కోట్లు పెట్టి మొబైల్స్ కొన్నారంటూ అజయ్ కల్లం చేసిన ఆరోపణల్లో వాస్తవం ఇసుమంతైనా లేదన్నారు.

అత్యున్నత పదవులు అనుభవించిన అజయ్ కల్లం, ఐవైఆర్ కృష్ణారావులు పదవుల్లో ఉన్నప్పుడు ఒక్క మాటా మాట్లాడలేదని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి  ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జవహర్ దుయ్యబట్టారు. ఒకవేళ అప్పుడు తప్పులు జరుగుతుంటే ఫైళ్లపై సంతకాలు ఎలా చేశారని ప్రశ్నించారు. ఐవైఆర్ కృష్ణారావు ఇప్పటికే బీజేపీలో చేరారని, అజయ్ కల్లం జగన్‌తో కలుస్తారని అనుమానంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడుతున్న వారి మెదళ్లలో బహుశా చిప్ పాడై ఉంటుందని, సరి చూసుకోవాలని సూచించారు.

రాష్ట్రప్రభుత్వంలో సముచితమైన పదవులు అనుభవించిన వారు పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ అన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు ఇలా స్వప్రయోజనాల కోసం దిగజారి విమర్శలు చేయడం శోచనీయమన్నారు.