Sabarimala: ప్రశాంత శబరిమలను రణరంగం చేశారు... పినరయి సర్కారుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

  • గత రాత్రి మరో 69 మంది అరెస్ట్
  • భక్తులను బందిపోట్లనుకుంటున్నారా?
  • 144 సెక్షన్ అవసరం ఏంటి?
  • రాత్రి పూట సన్నిధానంలో భక్తులను ఉండనివ్వాల్సిందే
  • కేరళ హైకోర్టు ఆదేశం

ఎలాగైనా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న అతివలను శబరిమలలోని అయ్యప్ప సన్నిధానానికి చేర్చాలని పట్టుమీదున్న కేరళ సర్కారు, గత రాత్రి మరో 69 మంది భక్తులను సన్నిధానంలో అరెస్ట్ చేయించింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ ఆదివారం నాడు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నిన్న నిరసనలు చేస్తూ, హైకోర్టును ఆశ్రయించిన వేళ, పినరయి ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు పెట్టింది.

ప్రశాంతతకు మారుపేరైన అయ్యప్ప ఆలయాన్ని ప్రభుత్వం రణరంగంగా మార్చివేసిందని అభిప్రాయపడింది. స్వామి దర్శనానికి వస్తున్న భక్తులను బందిపోట్లలా చూస్తున్నారని మండిపడుతూ, ఆలయం వద్ద 144 సెక్షన్ ఎందుకని నిలదీసింది. భక్తుల అరెస్ట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, నెయ్యాభిషేకం టికెట్ లను కొనుగోలు చేసిన భక్తులను రాత్రిపూట సన్నిధానంలో ఉండనివ్వాల్సిందేనని స్పష్టం చేసింది. సన్నిధానం వద్ద నియమించిన పోలీసుల అనుభవానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

కాగా, ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆందోళనకారులంతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని, వారు కావాలనే ఆలయం వద్దకు వచ్చి ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. భక్తులంటే తమకు ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించారు.

More Telugu News