Telangana: వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణను జలదోపిడి చేశారు.. ఖమ్మంను ఎడారిగా మార్చారు!: సీఎం కేసీఆర్

  • తెలంగాణకు పెద్ద ప్రమాదం రాబోతోంది
  • సిగ్గులేకుండా కాంగ్రెస్, టీడీపీలు ఓట్లడుగుతున్నాయి
  • ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

తుమ్మల నాగేశ్వరరావు కేవలం 10 నెలల్లో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. టీడీపీ హయాంలో పాలేరును ఎండబెట్టారనీ, మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలేరు పచ్చబడిందని చెప్పారు. మహాకూటమి రూపంలో తెలంగాణకు పెద్ద ప్రమాదం రాబోతోందని హెచ్చరించారు. ఏడు మండలాలను ఏపీ అక్రమంగా తీసుకోకముందు గోదావరి ఖమ్మం జిల్లాలో 180 కిలోమీటర్లు ప్రవహించేదనీ, ఇప్పుడు మాత్రం 145 కిలోమీటర్లకే పరిమితమయిందని వెల్లడించారు. పాలేరులో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

ఇలా ఖమ్మం జిల్లాను విడగొట్టి, కరువు బాట పట్టించిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రజల ముందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో ఉన్నది ప్రజలు కాదా? ఇక్కడ రైతులు లేరా? అని ప్రశ్నించారు. తాను చెప్పేది నిజమా? కాదా? అన్న విషయమై వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని విలేకరులను కోరారు.

తెలంగాణలోని ప్రాజెక్టులకు ఎక్కడ చూసినా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మల్లయ్య, ఎల్లయ్య పేర్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి పరిస్థితి పేరుగొప్ప-ఊరు దిబ్బలాగా తయారయిందనీ, ఈ ప్రాజెక్టుల్లో ఇప్పుడు చుక్కనీరు రావడం లేదని విమర్శించారు. స్థానికంగా గొప్ప చరిత్ర ఉన్న కొమురం భీం వంటి ఉద్యమకారుల పేర్లను పెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలకు మనసు రాలేదని దుయ్యబట్టారు.

చంద్రబాబు అక్రమంగా ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు విలీనం చేసుకున్నారని ఆరోపించారు. దీంతో తెలంగాణలోని ఈ ప్రాజెక్టుల హెడ్ వర్క్స్, కాలువలు అన్నీ మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను జలదోపిడీ చేసేందుకే అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరాసాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులను నిర్మించారని కేసీఆర్ ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని పట్టించుకోక పోవడంతో కరువు వచ్చి ఎడారి పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు.

గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును కట్టుకునే ప్రణాళికలో భాగంగానే రాజశేఖరరెడ్డి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ లను కంటితుడుపు చర్యగా చేపట్టారని విమర్శించారు. ఇందుకోసం ఖమ్మంలో వేలాది ఎకరాలు, రెండు లక్షల గిరిజనులు ముంచివేశారని తెలిపారు. సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా లాగేసుకున్నారని వాపోయారు. గోదావరి జిల్లాల తరహాలో ఖమ్మంను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

More Telugu News