KCR: కులాలు, మతాలు అన్నం పెట్టవు.. వాటిపై ఓట్లు అడిగితే చెంప ఛెళ్లుమనిపించండి!: సీఎం కేసీఆర్

  • కాంగ్రెస్, టీడీపీలో మహామేధావులు ఉన్నారు
  • నా పొలంలో కూడా మోటార్లు కాలిపోయాయి
  • వాస్తవాల ఆధారంగా ప్రజలు ఓటేయాలి

అధికారం కోల్పోయిన మూడేళ్లకే కాంగ్రెస్ నేతలు 6 చందమామలు, 7 సూర్యుళ్లను తెస్తామని చెబుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తన నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉచిత కంటివైద్య శిబిరం పెట్టినట్లు వెల్లడించారు. దీంతో ఆ చిన్నఊరిలోనే 227 మంది చికిత్స కోసం వచ్చారని పేర్కొన్నారు. ఈ ఘటనతోనే కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చామని కేసీఆర్ అన్నారు. స్థానిక సమస్యల ఆధారంగానే తమ పథకాలు పుట్టాయని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

పాలేరులో బోదకాలుతో బాధపడేవారిని గతంలో ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదని కేసీఆర్ తెలిపారు. బోదకాలు బాధితులకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందనీ, ఉచితంగా చికిత్స అందజేస్తోందని అన్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 411 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే ఎక్కువ గౌరవవేతనం పొందే ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, ట్రాఫిక్ పోలీసులు కేవలం తెలంగాణలోనే ఉన్నారని పేర్కొన్నారు. రూ.43,000 కోట్లతో తెలంగాణను సంక్షేమ రాష్ట్రంగా మార్చామని ముఖ్యమంత్రి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో మహానుభావాలు, అంతర్జాతీయ మేధావులు ఉన్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. విద్యుత్ ను 9 గంటలు కూడా ఇవ్వలేని కాంగ్రెస్, టీడీపీ నేతల మేధావితనం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. తన పొలంలో కూడా మోటార్లు కాలిపోయాయని గుర్తుచేసుకున్నారు. తాను చెప్పేది అబద్ధం అయితే టీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు లేకుండా ఊడగొట్టాలనీ, అదే వాస్తవమైతే ప్రతిపక్షాలకు డిపాజిట్లు రానివ్వొద్దని ప్రజలను కోరారు.

ప్రజలు కులం, మతం ఆధారంగా కాకుండా వాస్తవాల ఆధారంగా ఓటు వేయాలన్నారు. కులం, మతం ఆధారంగా ఎవ్వరూ బాగుపడలేదన్నారు. కులాలు, మతాలు ఎవ్వరికీ అన్నం పెట్టవని సీఎం అన్నారు. ఫలానా కులం వ్యక్తి సీఎం కాగానే ఆ కులంలో పేదరికం పూర్తిగా అంతరించిపోయిన దాఖలాలు లేవన్నారు. కులం, మతం పేరుతో ఓట్లడిగే వ్యక్తిని చెంప ఛెళ్లుమనిపించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి రాజకీయాలు అసలు రాజకీయాలే కాదని వ్యాఖ్యానించారు.

More Telugu News