Telangana: గత ఎన్నికల సమయంలో ఖమ్మంను లెక్కలోకి తీసుకోలేదు.. ఇప్పుడు ఇక్కడి నుంచే ప్రారంభించా!: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్

  • కులాల కుళ్లు, డబ్బు ప్రవాహం రాబోతోంది
  • ప్రజలు వాటి మాయలో పడొద్దు
  • మా ఒక్క ఇల్లు కాంగ్రెస్ టీడీపీల 7 ఇళ్లకు సమానం

ఖమ్మం జిల్లా గొప్ప పోరాటాల గడ్డ అనీ, అనేక తలపండిన రాజకీయ నాయకులు ఇక్కడే పుట్టారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నిజాలు నిష్ఠూరంగా ఉన్నా మాట్లాడుకోవడం మంచిదేనని వ్యాఖ్యానించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతలతో ‘ఉత్తర తెలంగాణ పుణ్యాన మనం అధికారంలోకి వస్తాం. అయితే ఖమ్మం, హైదరాబాద్ ను పరిగణనలోకి తీసుకోకుండా పోరాడాల్సి ఉంటుంది’ అని తాను చెప్పనట్లు కేసీఆర్ వెల్లడించారు. అయితే ఈ సారి ఎన్నికల ప్రచారాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు తాను దిశానిర్దేశం చేశానని పేర్కొన్నారు.

ఖమ్మంలోని పాలేరులో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఈసారి టీఆర్ఎస్ మొత్తం 10కి పది స్థానాలను గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కులాల కుళ్లు, దొంగ డబ్బు ప్రవాహం, గజకర్ణగోకర్ణ టక్కుటమారా విద్యలు చాలా ఉంటాయని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ చైతన్యం ఉన్న ఖమ్మం ప్రజల ముందు ఇవి నిలబడవని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కొందరు చేసే తప్పుడు ప్రచారంలో కొట్టుకుపోవద్దని సూచించారు. వ్యక్తులు శాశ్వతం కాదనీ, ప్రజలు, జిల్లా, రాష్ట్రమే శాశ్వతమని కేసీఆర్ అన్నారు.

ప్రత్యేక ఉద్యమం సందర్భంగా తాను చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను ధైర్యంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కొందరు నేతలు ‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చెప్పినవన్నీ కట్టారా? దళితులకు మూడెకరాలు ఇచ్చారా?’ అని తమను ప్రశ్నిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు కట్టిన 7 ఇళ్లు కలిపితే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు తయారవుతుందని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో 2.70 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో అప్పులు చేసి ఇళ్లు కట్టుకోవాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు తాము కడుతున్న ఇల్లు రెండు తరాల పాటు నిలుస్తుందన్నారు. వీటి నిర్మాణం 6 నెలలు ఆలస్యమైతే కొంపలేవీ మునిగిపోవని వ్యాఖ్యానించారు. ఇంట్లో ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ఈ ఇళ్లను కట్టామని తెలిపారు.

More Telugu News