TAx: ఏడాదిన్నర కాలంలో రూ. 50 వేల కోట్ల పన్ను ఎగవేత... గుర్తించిన సీబీఐసీ!

  • గడచిన ఏడాదిన్నరలో భారీ ఎగవేత
  • జీఎస్టీ ఎగవేత రూ. 4,441 కోట్లు
  • జీఎస్టీ అమలులోకి రాకముందుకన్నా తక్కువే
  • వెల్లడించిన సీబీఐసీ తాజా నివేదిక

గడచిన ఏడాదిన్నర కాలంలో ఇండియాలో రూ. 50 వేల కోట్లకు పైగా పన్నును ఎగవేశారని కేంద్ర పరోక్ష పన్నుల విభాగం (సీబీఐసీ) గుర్తించింది. ఈ మొత్తంలో పది శాతం జీఎస్టీ నుంచి రావాల్సి వుందని తెలిపింది. సీఐబీసీ పర్యవేక్షణలో పనిచేస్తున్న డీజీజీఐ (జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2017-18 మధ్య 604 జీఎస్టీ ఎగవేత కేసులు నమోదు కాగా, రూ. 4,441 కోట్ల మొత్తం కేంద్రానికి రావాల్సివుందని తెలిపింది.

ఇక సర్వీస్ టాక్స్ (సేవా పన్ను) ఎగవేతల విలువ రూ. 39,047 కోట్లు కాగా, కేంద్ర ఎక్సైజ్ సుంకాల ఎగవేత రూ. 6,621 కోట్లుగా ఉందని సీబీఐసీ పేర్కొంది. కాగా, జీఎస్టీ అమలులోకి రాకముందు పన్ను ఎగవేతలు చాలా ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం పన్ను వసూళ్ల రేటు పుంజుకుందని, పన్ను ఎగవేతల్లో 57 శాతం రికవరీని కూడా సాధించామని తెలిపింది. ఇదే సమయంలో ఈ సంవత్సరం నమోదైన పాతకేసుల్లో మాత్రం రికవరీ రేటు కేవలం 9 శాతమేనని తెలియజేసింది.

More Telugu News