Andhra Pradesh: ప్రతి ఎకరాలో పంటను కాపాడుతాం.. రబీలో భారీగా వరి సాగుచేయడం శుభసూచకం!: చంద్రబాబు

  • ఏపీలో లోటు వర్షపాతం సమస్యగా మారింది
  • నదుల అనుసంధానంతో సమస్య పరిష్కారం
  • అమరావతిలో సీఎం టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ లో లోటు వర్షపాతం అన్నది ప్రధాన సమస్యగా మారిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాగు చేసిన ప్రతి ఎకరాలో పంటను కాపాడాలని, ఇందుకోసం రైతన్నలకు వర్క్ షాపులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సూక్ష్మసేద్యం, నదుల అనుసంధానంతో నీటి కొరతను అధిగమించవచ్చని చెప్పారు. అమరావతిలో నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై ఈ రోజు వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏటా 10 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. రబీలో సాధారణం కన్నా 106 శాతం వరినాట్లు పడ్డాయన్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో ఈసారి రైతులు అదనంగా వరిని సాగు చేస్తున్నారనీ, ఇది శుభ సంకేతమని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, ఎరువుల వాడకం, తెగుళ్ల నివారణ కోసం రైతులకు వర్క్ షాప్ నిర్వహించాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఈసారి 35 శాతం లోటు వర్షపాతం నమోదయిందని సీఎం చెప్పారు.

More Telugu News