Alighar: వేళ్లు కొరుకుతూ, చెప్పుతో కొడుతూ... ఏడేళ్ల విద్యార్థిపై టీచర్ దాష్టీకం... సీసీటీవీలో రికార్డు!

  • ఏడేళ్ల చిన్నారిపై కనికరం చూపని టీచర్
  • జుట్టు పట్టుకుని, చెవులు మెలిపెట్టి హింస
  • హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

ఆ ఏడేళ్ల చిన్నారి సరిగ్గా చదవలేదో... లేకుంటే హోమ్ వర్క్ చేయలేదో... ఆ ట్యూషన్ టీచర్ మాత్రం దారుణాతి దారుణంగా ప్రవర్తించాడు. ఏడేళ్ల విద్యార్థిని అతను పెట్టిన హింస సీసీటీవీ రికార్డుల్లోకి ఎక్కి వైరల్ అవుతోంది. అలీగఢ్ లో వెలుగులోకి వచ్చిన, దాదాపు ఆరునిమిషాలున్న ఈ వీడియోలో, బాలుడిని సదరు టీచర్ పదేపదే కొట్టాడు. అతని జుట్టు పట్టుకుని ఈడ్చాడు. చెవులు మెలిబెట్టాడు. చెప్పు తీసుకుని కొట్టాడు. బాలుడు ఏడుస్తున్నా కనికరం చూపలేదు. అంతటితో ఆగకుండా, అతని వేళ్లను నోటితో కొరికేశాడు. ఆపై అతనికి ఓ గ్లాస్ మంచినీళ్లిచ్చి, నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు.

వాస్తవానికి బాలుడి ఇంటికి వెళ్లి ట్యూషన్ చెబుతుంటాడు ఆ టీచర్. గది తలుపు వేసి ఉండగా, ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలుడి తండ్రి పనిచేసే వర్క్ షాప్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో లోపం ఉందని ఫిర్యాదులు రావడంతో దాన్ని తెచ్చి ఇంట్లో అమర్చి పరీక్షిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ చేసిన పనిని చూసిన ఆ తండ్రి ఆగ్రహంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన అలీగఢ్ పోలీసులు, టీచర్ ను అరెస్ట్ చేసి, హత్యాయత్నం (ఐపీసీ 307) కింద కేసు పెట్టారు.

More Telugu News