గెలుపుగుర్రాలకే కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.. 25 మందికి నేనే టికెట్లు ఇప్పించా!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

19-11-2018 Mon 09:42
  • ఓ 10 స్థానాల్లో మార్పులు జరగొచ్చు
  • మునుగోడులో ఘనవిజయం సాధిస్తా
  • రాహుల్ తో రోడ్ షో నిర్వహిస్తాం
కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా గెలిచే అభ్యర్థులకే ఈసారి టికెట్లు కేటాయించిందని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే ఓ 10 స్థానాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదన్నారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నామనీ, ఆయా స్థానాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఎన్నికల్లో 25 మంది అభ్యర్థులకు తాను టికెట్లు ఇప్పించానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు మునుగోడు టికెట్ ఇచ్చిందనీ, ఇక్కడ గతంలో రావి నారాయణ రెడ్డి సాధించిన భారీ మెజారిటీని అధిగమించేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో మొత్తం 10 స్థానాలను దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ తో కలిసి జిల్లాలో రోడ్ షో నిర్వహిస్తామని తెలిపారు.