Ayyappa: అయ్యప్ప సన్నిధిలో అర్ధరాత్రి ఉద్రిక్తత... 70 మంది అరెస్ట్... సీఎం ఇంటి ముట్టడి!

  • అయ్యప్ప ఆలయంలో రాత్రి పూట ఉండొద్దంటున్న పోలీసులు
  • నిబంధన వెంటనే తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
  • పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో అర్ధరాత్రి పూట భక్తులు ఎవరూ ఉండకూడదన్న పోలీసుల ఆంక్షలను పాటించని, దాదాపు 70 మందిని అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయం మూసివేసిన తరువాత, అక్కడ ఉండిపోయిన భక్తులు, అనూహ్యంగా నిరసనలకు దిగారు. ఇదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం సహా పలు చోట్ల భారీఎత్తున నిరసనలు జరిగాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా, అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారుల అరెస్ట్‌ లను హిందూ సంఘాలు ఖండించాయి.

ఆలయ పరిసరాల్లో మోహరించిన పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌ ను బీజేపీ తెరపైకి తెచ్చింది. బీజేపీ పిలుపుమేరకు ఆరెస్సెస్‌, కేరళ హిందూ సంఘాలు, ఏ మాత్రం చడీచప్పుడూ లేకుండా, అర్థరాత్రి ఆందోళన చేపట్టారు. రాత్రి సమయాల్లో ఆలయ పరిసరాల్లో భక్తులు ఉండరాదనే నిబంధనను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. కొచ్చి, కోచికోడ్, మలప్పురమ్, అరన్ ములా, కొల్లాం అళపుళ, రన్ని, తొడుపుల, కాలడి తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలూ జరిగాయి.

కాగా, ఇటీవల చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలోనే అర్థరాత్రి ఆలయ పరిసరాల్లో భక్తులు ఉండరాదనే ఆంక్షలు పెట్టామని పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలవుతుందని, పోలీసులు భక్తులకు వ్యతిరేకమని భావించరాదని, వారి క్షేమం కోసమే తాము పని చేస్తున్నామని పోలీస్‌ అధికారి ప్రతీష్‌ కుమార్ తెలిపారు.

More Telugu News