Ayodhya: ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా యోగి ఉన్నారు.. రాముడు మాత్రం టెంటులో ఉన్నాడు: సొంతపార్టీపై బీజేపీ నేత విమర్శలు

  • పీఎం, సీఎం తీరు దేశానికి మచ్చ తెచ్చేలా ఉంది
  • ఆలస్యం చేస్తే రాముడికి కోపం వస్తుంది
  • వెంటనే పునాది రాయి వేయండి

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సొంత పార్టీ పైనే విరుచుకుపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే ఆయన ఈసారి ప్రధాని  మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రధానిగా నరేంద్రమోదీ, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నప్పటికీ రాముడు మాత్రం ఇంకా టెంట్‌లోనే ఉన్నాడని, ఇది దేశానికే మాయని మచ్చని వ్యాఖ్యానించారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరూ హిందూ ధర్మానికి విలువ ఇచ్చే వాళ్లే అయినప్పటికీ సత్వర నిర్ణయం తీసుకోలేకపోతున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రామ మందిర నిర్మాణంపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బతినక ముందే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే బీజేపీకి పెను నష్టం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో జాప్యానికి చోటివ్వకుండా వెంటనే మందిర నిర్మాణానికి పునాది రాయి వేయాలని కోరారు. ఇంకా ఆలస్యం చేస్తే రాముడికి కోపం వస్తుందని పేర్కొన్నారు. కాగా, ఇటీవల యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ మాట్లాడుతూ రాముడు తనకు ఆలయం కావాలని ఎప్పుడు కోరుకుంటే అప్పుడే నిర్మిస్తామని చెప్పడం గమనార్హం.

More Telugu News