Narendra Modi: చంద్రబాబు తదుపరి స్టెప్ ఏంటి?.. ఏపీ అధికారులను ఆరాతీస్తున్న ఢిల్లీ వర్గాలు!

  • నరేంద్ర మోదీని రెండుసార్లు ధిక్కరించిన చంద్రబాబు
  • డీజీపీ నియామకంలో కేంద్రం పాత్రకు అడ్డుకట్ట
  • ఆపై సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా ఉత్తర్వులు
  • తదుపరి చర్యలు ఏంటని ఎడతెగని చర్చ

ప్రధాని నరేంద్ర మోదీని ధిక్కరించిన చంద్రబాబు, తదుపరి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఢిల్లీ వర్గాలు, ఏపీ అధికారులకు ఫోన్ చేసి మరీ ఈ విషయాన్ని ఆరా తీస్తున్నారు. గతంలో డీజీపీని ఎంపిక చేసినప్పుడు, తాజాగా, సీబీఐకి రాష్ట్రంలోకి నో ఎంట్రీ చెబుతూ జీవో జారీ చేసి, కేంద్రం పెత్తనాన్ని దెబ్బకొట్టిన ఆయన, ఆపై పలువురు జాతీయ పార్టీల నేతలను కలిసి, మోదీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఇక తరువాత ఏం చర్యలు తీసుకోనున్నారు? అని ఏపీ లోని తమ బ్యాచ్ మేట్లకు ఉన్నతాధికారులు ఫోన్ చేసి అడుగుతున్నారు.

వాస్తవానికి డీజీపీగా నండూరి సాంబశివరావు నియామకం జరిగే నాటికి ఎంపిక ప్రక్రియ కేంద్రం చేతుల్లో ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. డీజీపీ నియామకం కోసం కొందరి పేర్లను కేంద్రానికి పంపితే, వారి నుంచి ఒకరిని ఎంపిక చేస్తారు. అప్పటికే ఇన్ చార్జ్ డీజీపీగా ఉన్న నండూరి, మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనుండగా డీజీపీగా ఎంపిక ఎందుకని, మరో పేరు చెప్పాలని కేంద్రం ప్రశ్నించడంతో చంద్రబాబు సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ ఎంపికకు కేంద్ర కమిటీతో సంబంధమేంటని ప్రశ్నిస్తూ, చట్టపరమైన మార్పులు చేసి, కేంద్ర పెత్తనానికి అడ్డుకట్ట వేసింది.

ఆ తరువాత సీబీఐ విషయంలోనూ అంతే జరిగింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం కింద ఏర్పాటు చేసిన సీబీఐ, అప్రతిష్ఠను మూటగట్టుకుందని ఆరోపిస్తూ, అనూహ్యంగా రాజ్యాంగంలోని కొన్ని అంశాల ప్రాతిపదికన, సీబీఐ అధికారులు రాష్ట్రంలో ప్రవేశించేందుకు అనుమతిని నిరాకరించింది. దీని తరువాత మూడు రోజులుగా, చంద్రబాబు తదుపరి చర్యలేంటన్న చర్చ జోరుగా సాగుతుండటం గమనార్హం.

More Telugu News