Congress: అదృష్టం అంటే వీరిదే.. ప్యారాచూట్ నేతలకు టికెట్లు.. అన్ని పార్టీలదీ అదే తీరు!

  • పార్టీ మారినా టికెట్ దక్కించుకున్న నేతలు
  • పోటీ పడి టికెట్లు ఇచ్చిన అన్ని పార్టీలు
  • ఒక్క రోజులోనే టికెట్లు దక్కించుకున్న నేతలు

అదృష్టం అంటే వారిదే మరి. సొంతపార్టీలో టికెట్ కోసం ఎదరుచూసీ చూసీ అలసిపోయిన నేతలు పక్క పార్టీలోకి ఇలా వెళ్లి అలా టికెట్ కొట్టేశారు. అంతేకాదు, ఆయా పార్టీలు కూడా ప్యారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపడం విశేషం. తమకు పార్టీ ముఖ్యం కాదని నేతలు తేటతెల్లంగా చెప్పేస్తుంటే.. మాకు పెద్దగా పట్టింపులు లేవని పార్టీలు నిరూపిస్తున్నాయి. సిద్ధాంతాలు, అభిప్రాయాలను పక్కనపెట్టేసి కొత్తగా వచ్చి కండువా కప్పుకున్న వారికి టికెట్లు ఇచ్చేందుకు పోటీ పడ్డాయి. ఇంకా విశేషం ఏంటంటే.. రాత్రి పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి ఉదయాన్నే బీఫాం ఇవ్వడం గమనార్హం. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, బీఎల్ఎఫ్.. ఇలా పార్టీలన్నీ తమను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి మళ్లీ తమ పంచన చేరిన వారికే టికెట్లు ఇచ్చాయి.  

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తనకు టీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ సంపాదించుకున్నారు. జుక్కల్‌లో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే అరుణతార బీజేపీలో చేరి రోజైనా గడవకముందే టికెట్ సంపాదించుకోగలిగారు. కోదాడ టికెట్ ఆశించిన టీడీపీ నేత మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్‌లో చేరి టికెట్ సంపాదించుకున్నారు. టీఆర్ఎస్‌ తనకు టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరిన మాజీ మంత్రి బాబు మోహన్ బీజేపీ నుంచి బరిలో నిలిచారు. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన రాజేశ్వరరావు దేశ్‌పాండే సంగారెడ్డి నుంచి పోటీలో నిలిచారు. ఇక, పార్టీ మారిన రోజే టికెట్ సంపాదించుకున్న నేతగా పీసీసీ కార్యదర్శి వెంకట్ రికార్డులకెక్కారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన రోజే ఆయనకు కోరుట్ల టికెట్ ఖరారైంది.

టీఆర్ఎస్‌లో టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన రమేశ్ రాథోడ్ ఖానాపూర్ నుంచి బరిలోకి దిగుతుండగా, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కేఎస్ రత్నం చేవెళ్ల నుంచి పోటీ పడుతున్నారు. దేవరకొండ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న బాలు నాయక్ విషయమైతే మరీ విడ్డూరం. తొలుత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఆయనకు టీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. దీంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరి దేవరకొండ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి బీఎల్పీలో చేరిన రోజే కొత్తగూడెం టికెట్‌ను యడవల్లి కృష్ణ దక్కించుకున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఎల్పీలో చేరిన రాంబాబు మధిర నుంచి, టీడీపీ నుంచి కాంగ్రెస్.. ఆపై బీఎల్పీలో చేరిన బోడ జనార్దన్ చెన్నూరు నుంచి పోటీ చేస్తున్నారు.

More Telugu News