chinna jeeyar swamy: శబరిమల వివాదంపై స్పందించిన చినజీయర్ స్వామి

  • మసీదు విషయంలో సుప్రీం అలా చెప్పగలదా?
  • శాస్త్రాలు, దేవాలయాల విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువైంది
  • శంషాబాద్‌లో 216 అడుగుల భగవాన్ రామానుజాచార్యుల విగ్రహం

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును  త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి తప్పుబట్టారు. చెన్నైలో ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని పేర్కొన్నారు. భగవంతుడిపై నమ్మకం ఉన్న వారు వాటిని అనుసరించాలని, లేని వారు వాటికి జోలికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమమన్నారు. దేవాలయాలు, శాస్త్రాల విషయంలో ఇటీవల రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు శాస్త్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. శబరిమల విషయంలో అటువంటి తీర్పు ఇచ్చిన ధర్మాసనం మసీదుల విషయంలో అలా చేయగలదా? అని సూటిగా ప్రశ్నించారు.

శాస్త్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ఇతరుల జోక్యం కూడదని చినజీయర్ స్వామి అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సమాజానికి ప్రమాదం లేకుండా ప్రతి ఒక్కరు అనుభవించొచ్చన్నారు. కొండపై కొలువైన అయ్యప్ప కిందకి దిగడని, ఆయనంటే నమ్మకం ఉన్నవారు పైకి వెళ్తారని, లేని వారు వదిలేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో 216 అడుగుల ఎత్తైన భగవాన్ రామానుజాచార్యుల విగ్రహాన్ని నెలకొల్పనున్నట్టు తెలిపారు. ‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’పేరుతో 70 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ నిర్మాణం 2019 నాటికి పూర్తవుతుందని చిన జీయర్ స్వామి తెలిపారు.

More Telugu News