Congress: కాంగ్రెస్ కు 60 ఏళ్లుగా సేవ చేస్తున్న మాకే అన్యాయం జరిగింది... ఇక కార్యకర్తలకు మేం ఏం చెప్పాలి?: పాల్వాయి స్రవంతి

  • గత 20 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నాం
  • మా నాన్న 60 ఏళ్లు కాంగ్రెస్ కు అంకితం అయ్యారు 
  • మునుగోడు టికెట్ ఇవ్వకపోవడంపై ఆవేదన

తెలంగాణ ఎన్నికల వేళ టికెట్ లభించని నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రెబెల్స్ గా పోటీ చేసి తమ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరేమో ప్రత్యామ్నాయ పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంపై పాల్వాయి స్రవంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాలు సేవలు అందించారని ఆమె తెలిపారు. గత 20 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థంగా సేవ చేస్తున్నట్లు గుర్తుచేశారు.

అలాంటి తనకే ఈసారి టికెట్ కేటాయించకుండా పార్టీ హైకమాండ్ అన్యాయం చేసిందని వాపోయారు. తమకే ఇలా జరిగితే ఇక పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదన్నారు. మునుగోడు టికెట్‌ ను పాల్వాయి స్రవంతిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ హైకమాండ్ కేటాయించిన సంగతి తెలిసిందే.

More Telugu News