chinmayee: చిన్మయికి సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన భర్త రాహుల్ రవీంద్రన్!

  • భవిష్యత్ లో స్త్రీ-పురుషులు సమానమనే రోజులొస్తాయి
  • చిన్మయి వ్యాఖ్యలు ప్రమాదకరంగా భావించవచ్చు
  • ఇంకా ఇలాంటి గొంతులు చాలా వస్తాయన్న రాహుల్

ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు, తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజాలు పలువురు మహిళా ఆర్టిస్టులను లైంగికంగా వేధించారని గాయని చిన్మయి శ్రీపాద ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఎలాంటి సభ్యత్వ రుసుము చెల్లించలేదన్న కారణం చూపుతూ చిన్మయిని యూనియన్ నుంచి బహిష్కరించారు.

ఈ చర్యను ఖండించిన చిన్మయి శ్రీపాద.. మరి గత రెండేళ్లుగా తన ఫీజులో 10 శాతాన్ని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. అయితే ఈ సందర్భంగా చిన్మయిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న ప్రబుద్ధులకు ఆమె భర్త నటుడు రాహుల్ రవీంద్రన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.

మీలాంటి పనీపాటా లేని వెధవలు నా టైమ్ లైన్ లోకి చేరి గోలగోల చేస్తున్నారు. నిజం చెబుతున్నా.. మీలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ నాకు నిజంగా చికాకుగా ఉంది. కాబట్టి ఈ మెసేజ్ మీ అందరి కోసం..

నా భార్య కారణంగా మీకు అసౌకర్యం కలిగిఉండొచ్చు. ఎందుకంటే ఏ సమస్యపై అయినా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడగల అరుదైన వ్యక్తి చిన్మయి. ఆమె మాటతీరు, చర్యలు మీకు ప్రమాదకరంగా అనిపించవచ్చు. మగాళ్ల ఆధిపత్యం తగ్గిపోతుందని మీరు భయపడుతూ కూడా ఉండొచ్చు. అయినా మీరు భరించకతప్పదు. ప్రస్తుతం ప్రపంచం మారుతోంది. ఆడ-మగ, స్త్రీ-పురుషుడు సమానమేనన్న ప్రపంచం మరెంతో దూరంలో లేదు. కాలం గడిచేకొద్ది ఇలాంటి గొంతుకలు పెరుగుతూనే ఉంటాయి.

మీకు చిన్మయి తలనొప్పిగా అనిపించవచ్చు. కానీ నాకు ఎంతమాత్రం కాదు. తాను నిస్వార్థంగా ప్రేమిస్తుంది, సేవ చేస్తుంది. నా గురించి, మా బుజ్జి కుక్కపిల్లల గురించి పట్టించుకున్న దాంట్లో సగం సమయం కూడా తనను తాను పట్టించుకోదు. చిన్మయి చాలా ధైర్యవంతురాలు. అలాంటి అమ్మాయి మీ జీవితంలోకి రావాలనుకుంటున్నా. చిన్మయి లాంటి ధైర్యవంతులు సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే అలాంటి అమ్మాయిలు మీలాంటి వాళ్లను అసలు కోరుకుంటారా? అన్నదే నా అనుమానం
’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ సందేశాన్ని చిన్మయి తన ట్విట్టర్ లో షేర్ చేసుకుంది. కాగా, రాహుల్ రవీంద్రన్ పోస్ట్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News