USA: ప్రస్తుతం అమెరికాలో ఉన్నా.. రాతపూర్వకంగా ఎలా జవాబిస్తా?: డబ్బింగ్ యూనియన్ నోటీసుపై చిన్మయి శ్రీపాద ఫైర్!

  • యూనియన్ చీఫ్ రాజాపై చిన్మయి ఆరోపణలు
  • గాయనిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంస్థ
  • నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ చిన్మయి

సినీపరిశ్రమలో లైంగిక వేధింపులపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ గేయ రచయిత వైరముత్తుతో పాటు తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజా చాలామందిని లైంగికంగా వేధించారని చిన్మయి ఆరోపించింది. ఈ నేపథ్యంలో చిన్మయిని తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తప్పిస్తూ రాజా ఆదేశాలు జారీచేశారు. దీనిపై చిన్మయి ఘాటుగా స్పందించింది.

ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాల్సిందిగా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చిన్మయి శ్రీపాద స్పష్టం చేసింది. తమిళ డబ్బింగ్ యూనియన్ పై ఇప్పటికే 15కు పైగా కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నాననీ, ఇలాంటప్పుడు రాతపూర్వకంగా వివరణ ఎలా ఇవ్వగలనని ప్రశ్నించింది. తాను అమెరికాలో ఉన్నందున ఇంకా నోటీసు అందుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయమై పరిశోధనాత్మక విచారణ జరపాలని వికటన్ పత్రిక ను కోరింది.

ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు ఎంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడంటూ ఆరోపించి దక్షిణాదిన 'మీటూ' ఉద్యమానికి చిన్మయి కేంద్రంగా మారింది. ఆమె చొరవతో చాలామంది ఆర్టిస్టులు కామాంధుల వేధింపులను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో చిన్మయి మాట్లాడుతూ.. తనను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగిస్తే గత రెండేళ్లుగా తన డబ్బింగ్ ఫీజు నుంచి 10 శాతం మొత్తాన్ని అసోసియేషన్ ఎందుకు తీసుకుందని ప్రశ్నించింది. తనపై వేటు కొనసాగితే, ఇటీవలి '96' చిత్రంలో త్రిషకు తాను చెప్పిన డబ్బింగ్ చివరిది అవుతుందని ట్వీట్ చేసింది. ఇక తన కెరీర్ ముగిసినట్టేనని వ్యాఖ్యానించింది.

More Telugu News