TRAI: ట్రాయ్ పరీక్షలో జియో తప్ప మిగతా కంపెనీలన్నీ ఫెయిల్!

  • జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్ లపై కాల్ డ్రాప్ పరీక్ష
  • కనీస నాణ్యతలేని ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్
  • మరింత దారుణంగా టాటా టెలీ సర్వీసెస్
  • ట్రాయ్ రిపోర్టులో వెల్లడి

ఎంపిక చేసిన జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులపై కాల్ డ్రాప్ పరీక్షలు నిర్వహించగా, రిలయన్స్ జియో మినహా మిగతా అన్ని టెలికం కంపెనీలు ఫెయిల్ అయ్యాయి. ట్రాయ్ వెల్లడించిన రిపోర్టు ప్రకారం, కాల్ డ్రాప్ లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో, మూడు రైల్ రూట్ లు, జాతీయ రహదారులపై పరీక్షలు నిర్వహించింది. "కేవలం జియో మాత్రమే నాణ్యమైన సేవలను అందిస్తోంది. కాల్ డ్రాప్ రేట్ నిబంధనలకు అనుగుణంగా ఉంది" అని నివేదికలో పేర్కొంది.

మొత్తం కాల్స్ లో 2 శాతం వాటంతట అవే డిస్కనెక్ట్ అవుతున్నాయని గుర్తించామని ట్రాయ్ వెల్లడించింది. అసన్ సోల్ నుంచి గయ, దిఘా నుంజి అసన్ సోల్, గయ నుంచి దనాపూర్, బెంగళూరు నుంచి మురుదేశ్వర్, రాయ్ పూర్ నుంచి జగ్దల్ పూర్, డెహ్రాడూన్ నుంచి నైనిటాల్, మౌంట్ అబూ నుంచి జైపూర్, శ్రీనగర్ నుంచి లేహ్ వరకూ ఉన్న జాతీయ రహదారులపైనా, అలహాబాద్ - గోరఖ్ పూర్, ఢిల్లీ - ముంబై, జబల్ పూర్, సింగ్రౌలీ రైల్వే ట్రాక్ లపై ఈ పరీక్షలు నిర్వహించామని పేర్కొంది.

భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ అందించే 3జీ, 2జీ నెట్ వర్క్ లు నాలుగు హైవేలపై, మూడు రైల్ రూట్లలో బెంచ్ మార్క్ ను సాధించలేకపోయాయని, టాటా టెలీ సర్వీసెస్ పరిస్థితి కూడా ఇంతేనని పేర్కొంది. టాటా టెలీ సర్వీసెస్ సంస్థ కనీసం కాల్ ను కనెక్ట్ చేసే విషయంలోనూ విఫలమైందని, ఎయిర్ టెల్ లో కాల్ సెటప్ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉందని తెలియజేసింది.

More Telugu News