Hyderabad: రూ. 71 లక్షల బంగారం, రూ. 31 లక్షల వెండి... నందమూరి సుహాసిని ఆస్తుల వివరాలివి!

  • మహాకూటమి కూకట్ పల్లి అభ్యర్థినిగా సుహాసిని
  • ఇళ్ల అద్దెలపై వస్తున్న ఆదాయం
  • రూ. 1.46 కోట్ల ఆప్పులు ఉన్నాయి
  • అఫిడవిట్ లో పేర్కొన్న సుహాసిని

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరఫున కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగిన నందమూరి సుహాసిని, నామినేషన్ లో భాగంగా ఆస్తి పాస్తుల వివరాలను అందించారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, సుహాసిని అసలు పేరు వెంకట సుహాసిని కాగా, ఎల్ఎల్బీ వరకూ చదువుకున్నారు. ఇళ్ల అద్దెల ద్వారా ఆమెకు ఆదాయమొస్తోంది. 2018-19లో రూ. 10.53 లక్షలకు ఆదాయపు పన్ను రిటర్న్ లను చూపించారు. తన చేతిలో రూ. 1.50 లక్షలు, భర్త చుండ్రు వెంకట శ్రీకాంత్ వద్ద రూ. 2 లక్షల నగదు, కుమారుడు వెంకట శ్రీహర్ష వద్ద రూ. 1 లక్ష నగదు ఉన్నాయి.

ఇక మిక్ ఎలక్ట్రానిక్స్, శ్రీ భవానీ క్యాస్టింగ్ లిమిటెడ్ లో ప్రస్తుత విలువ ప్రకారం రూ. 5.50 లక్షల విలువైన షేర్లు ఆమెకున్నాయి. రూ. 15 లక్షల విలువైన హ్యుందాయ్ క్రెటాతో పాటు రూ. 71 లక్షల విలువైన 2.2 కిలోల బంగారం, రూ. 30 లక్షల విలువైన వజ్రాలు, రూ. 31 లక్షల విలువైన 81 కిలోల వెండి సామాన్లు ఆమె వద్ద ఉన్నాయి. సుహాసిని మొత్తం ఆస్తుల విలువ రూ. 1.52 కోట్లు కాగా, భర్త ఆస్తులు రూ. 7 లక్షలుగా, కుమారుడి ఆస్తులు రూ. 1.02 కోట్లుగా ఆమె చూపించారు.

హైదరాబాద్, ఫిల్మ్‌ నగర్‌లో రూ. 4.30 కోట్ల విలువచేసే 450 గజాల స్థలంలో ఇల్లు, తన భర్త పేరిట తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో రూ. 65 లక్షల విలువైన 3.20 ఎకరాల భూమి ఉందని, కుమారుడి పేరిట మండపేటలో రూ. 88.38 లక్షల విలువైన 2455గజాల స్థలం ఉందని చెప్పారు. తనకు రూ. 1.46 కోట్ల అప్పులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

More Telugu News