Telangana: ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. ఓడిపోయే కాంగ్రెస్ నేతలకు మాటలెక్కువ!: హరీశ్ రావు

  • అభివృద్ధి పనులపై కాంగ్రెస్ చర్చకు రావాలి
  • సునీతా లక్ష్మారెడ్డి చేసిందేమీ లేదు
  • మెదక్ లో క్లీన్ స్వీప్ చేస్తాం

నర్సాపూర్ ప్రజలు 15 ఏళ్ల పాటు గెలిపించినా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమని తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని కాంగ్రెస్ నేత సునీతా లక్ష్మారెడ్డికి సవాలు విసిరారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువనీ, అదే రీతిలో ఓడిపోయే కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. నర్సాపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు మాట్లాడారు.

మెదక్ జిల్లాలోని 10 సీట్లకు గానూ పదింటిని టీఆర్ఎస్ దక్కించుకుంటుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్, ఎరువులు, నీళ్లు.. ఇలా ప్రతీదానికి తెలంగాణ ప్రజలు అల్లాడారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతన్నలకు విద్యుత్, నీటితో పాటు కావాల్సినంత ఎరువులను అందజేస్తుందని గుర్తుచేశారు. నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా అభిమానమని హరీశ్ రావు చెప్పారు. అందుకే ఆర్టీసి డిపోతో పాటు రూ.55 కోట్ల అభివృద్ధి పనులను నియోజకవర్గంలో తమ ప్రభుత్వం చేపట్టగలిగిందని వ్యాఖ్యానించారు.

గతంలో ఎన్నికల సందర్భంగా ప్రచారంలో కన్నీళ్లు పెట్టుకోవడంతో సునీతా లక్ష్మారెడ్డిని ప్రజలు సానుభూతితో గెలిపించారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రెండో సారి సైతం ఆమెకు పాపమని ఓట్లు వేశారని, ఊరికే ఏడిస్తే ఇకపై కుదరదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే  ఆ నీటితో సింగూరు నింపితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. కాగా, తనను రేవంత్ రెడ్డి తిట్టడంతోనే తనకు మరో 5 వేల ఓట్ల మెజారిటీ పెరిగిందని టీఆర్ఎస్ నేత మదన్ రెడ్డి చమత్కరించారు. 

More Telugu News