Andhra Pradesh: జగన్ ‘బోర్డర్ లైన్ పర్సనాలిటి డిజార్డర్’ వ్యాధితో బాధపడుతున్నారు!: దేవినేని ఉమ

  • నేనే గొప్ప అనే భ్రాంతిలో జగన్ ఉన్నారు
  • ఈ రోగానికి విదేశాల్లో చికిత్స ఉండొచ్చు
  • ఓ తమ్ముడిగా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నా

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ‘నేనే గొప్ప.. నేను చెప్పిందే వేదం’ అనే భ్రాంతిలో ఉంటారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మాట్లాడేటప్పుడు ఏమాత్రం వివేకం లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ లక్షణాలు ‘బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే వ్యాధికి ఉంటాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రం ఈరోజు ఎంతో పురోగమించిందనీ, ఇలాంటి వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉండొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు.

మైక్ చేతిలో ఉందని సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్, మంత్రులు అందరూ కలిసి తన హత్యకు కుట్ర పన్నారని జగన్ ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే జీతభత్యాలు తీసుకుంటూ రోడ్లమీద తిరుగుతూ ప్రభుత్వాన్ని తిడుతున్నారని దుయ్యబట్టారు. ఇదంతా కచ్చితంగా బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డరేనని స్పష్టం చేశారు. జగన్ విచక్షణ లేకుండా తాను చెప్పిందే జరగాలని కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ ప్రతిపక్ష నేత హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు.

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా జగన్ కనీసం సభలోకి అడుగుపెట్టలేదని ఉమ తెలిపారు. కనీసం ప్రజాసంకల్ప యాత్రలో గుర్తించిన ప్రజల సమస్యలను అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ మంత్రిపై ఫిర్యాదు అందినా, ఏ చిన్న సమస్య వచ్చినా డైరెక్టుగా అది ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. నిన్న జగన్ మాట్లాడిన భాష బాగోలేదని స్పష్టం చేశారు. ఈ రోగానికి మందులు తీసుకోవాలని ఓ తమ్ముడిగా, సహచర శాసన సభ్యుడిగా సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News